కంగన రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం.. జనాల్లో పలు అనుమానాలు!

Share Icons:
బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ ఇంటి వద్ద తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఆమె స్థానిక పోలీసులకు సమాచారమివ్వడంతో వారు రంగంలోకి దిగారు. గత కొంతకాలంగా బాలీవుడ్ యువ నటుడు విషయమై కంగనా ఘాటుగా రియాక్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే తనను భయపెట్టేందుకే ఈ కాల్పులు జరిపి ఉంటారని ఆమె అభిప్రాయపడింది. దీంతో జనాల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

శుక్రవారం రాత్రి హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీలో ఉన్న తన సొంత ఇంట్లో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా 11 గంటల 30 నిమిషాల సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేసింది. ఎనిమిది సెకన్ల వ్యవధిలోనే తాను రెండు షాట్లను విన్నట్టుగా ఆమె వెల్లడించింది. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ కాల్పులకు కారణాలేమిటో తెలియ రాలేదు.

Also Read:
అయితే ఈ విషయమై కంగనా స్పందిస్తూ.. తొలుత అది తుపాకీ శబ్దం అనుకోలేదని, రెండోసారి కూడా అదే శబ్దం రావడంతో కాల్పులు అనే విషయం అర్థమై అలర్ట్ అయ్యానని తెలిపింది. కానీ, అక్కడికి వచ్చిన పోలీసులు మాత్రం ఆపిల్ తోటల్లో గబ్బిలాలను భయపెట్టడానికి ఎవరైనా తుపాకీతో కాల్పులు జరిపి ఉంటారని అనుమానించినట్లుగా ఆమె పేర్కొంది. ఎవరో కావాలనే తనను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపింది.

అంతేకాదు సుశాంత్ సింగ్‌ని కూడా ఇలానే భయపెట్టారేమో అంటూ మరో సంచలనానికి తెరలేపింది. ఇటీవల మహారాష్ట ముఖ్యమంత్రి కుమారుడు ఆదిత్య థాకరేని ఉద్దేశిస్తూ ”బేబీ పెంగ్విన్‌” అని కామెంట్ చేసినందుకే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేసిన కంగనా.. ఇలాంటి వాటికి భయపడేదే లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం కంగనా ఇంటివద్ద జరిగిన ఈ కాల్పుల కలకలంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.