ఓ ఇంటివాడైన ‘నేను లోకల్’ రచయిత.. వివాహ వేడుకకు హాజరైన ‘జబర్దస్త్’ స్టార్స్

Share Icons:
కరోనా సమయంలోనూ తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసపెట్టి శుభకార్యాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ శుభకార్యాలు జరుపుకుంటున్నారు మన తారలు. మే నెలలో హీరో నిఖిల్ సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ పెళ్లాడారు. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఆ తరవాత రానా దగ్గుబాటి పెళ్లి నిశ్చయమైంది. రానా, మిహీకా బజాజ్ పెళ్లిని ఖరారు చేస్తూ ఇరుకుటుంబాలు రోకా ఫంక్షన్ కూడా చేసుకున్నాయి.

తాజాగా హీరో నితిన్ కూడా పెళ్లి చేసుకున్నారు. తాను ప్రేమించిన అమ్మాయి షాలిని కందుకూరిని హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పెళ్లాడారు. ఈ వివాహ వేడుక పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. అయితే, తాజాగా సినీ పరిశ్రమ నుంచి మరో సెలబ్రిటీ ఓ ఇంటివాడయ్యారు. యువ రచయిత ప్రసన్న కుమార్, మౌనికల వివాహం బుధవారం జరిగింది. రాత్రి 8.45 గంటలకు మచిలీపట్నంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో కొద్దిమంది బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ వివాహానికి దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన, హీరో అశ్విన్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, హైపర్ ఆది, అవినాష్ తదితరులు హాజరయ్యారు. కాగా, ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాల ద్వారా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసన్న కుమార్.. త్వరలోనే రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాకు కథ, మాటలు అందించనున్నారు. అలాగే వాలీబాల్ ప్లేయర్ అరికపూడి రమణారావు జీవిత చరిత్ర ఆధారంగా మరో కథను సిద్ధం చేస్తున్నారు.