ఐసీసీ ఫ్యానల్ అంపైర్‌‌గా అనంతపద్మనాభన్.. నాలుగో భారతీయుడు

Share Icons:
భారత అంపైర్ కేఎన్ అనంతపద్మనాభన్‌కి అరుదైన గౌరవం దక్కింది. కేరళాకి చెందిన ఈ అంపైర్‌కి తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇంటర్నేషనల్ ఫ్యానల్ ఆఫ్ అంపైర్స్‌ జాబితాలో చోటు దక్కింది. ఇప్పటికే ఈ ఫ్యానల్‌లో భారత్‌కి చెందిన సి.షంషుద్దీన్, అనిల్ చౌదరి, వీరేంద్ర శర్మ ఉండగా.. తాజాగా ఆ అవకాశం దక్కించుకున్న నాలుగో భారత అంపైర్‌గా అనంతపద్మనాభన్‌ నిలిచాడు.

కేరళ తరఫున లెగ్‌ స్పిన్నర్‌గా 1988 నుంచి 2004 వరకూ అనంతపద్మనాభన్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 105 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన అనంతపద్మనాభన్‌ రంజీల్లో కేరళ తరఫున 2000 పరుగులు, 200 వికెట్లు పడగొట్టిన తొలి క్రికెటర్‌గా అప్పట్లో అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘకాలంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే ఐపీఎల్, రంజీ, లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో రెగ్యులర్‌ అంపైర్‌గా కనిపించే అనంతపద్మనాభన్‌.. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ జరగనున్న ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ఇటీవల ఇంటర్నేషనల్ ఫ్యానల్ అంపైర్‌గా ఉన్న నితిన్ మీనన్.. ఐసీసీ ఎలైట్ ఫ్యానల్‌‌‌కి వెళ్లిపోవడంతో అతని స్థానాన్ని అనంతపద్మనాభన్‌‌తో ఐసీసీ భర్తీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా.. భారత్‌కి చెందిన ఐదుగురు అంపైర్లు ఐసీసీ అంపైర్స్‌గా సముచిత స్థానాన్ని దక్కించుకున్నారు.