ఐపీఎల్ 2020‌ సీజన్ మ్యాచ్‌లకి ఫ్యాన్స్‌కి ఎంట్రీ..?

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్‌ మ్యాచ్‌లకి స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించే సూచనలు కనిపిస్తున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ జరగనుండగా ఆదివారం గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత పూర్తి స్థాయిలో మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. అలా మ్యాచ్‌లు జరిగితే..? టోర్నీ కళ తప్పుతుందని ఆతిథ్య యూఏఈతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆందోళన చెందుతోంది.

2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ సక్సెస్‌ఫుల్‌గా 12 సీజన్లు ముగిశాయి. ఐపీఎల్‌కి లభించిన ఆదరణ, ఆదాయాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా చాలా క్రికెట్ దేశాలు ప్రైవేట్ టీ20 లీగ్స్‌ని ప్రారంభించాయి. కానీ.. ఏ లీగ్ కూడా ఐపీఎల్ తరహాలో క్లిక్ కాలేకపోయింది. ముఖ్యంగా.. ఐపీఎల్ క్రేజ్ ఏటా ఊహించని స్థాయిలో పెరుగుతూ.. బీసీసీఐకి కనకవర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. బోసిపోయిన స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తే..? ఆటగాళ్లలో ఉత్సాహం కొరవడుతుందని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు 2014లో భారత్‌లో సార్వత్రిక ఎన్ని కారణంగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకి మాత్రమే ఆతిథ్యమిచ్చిన యూఏఈ.. ఈసారి పూర్తి స్థాయిలో టోర్నీని నిర్వహించే ఛాన్స్ కొట్టేసింది. దాంతో.. టోర్నీని సక్సెస్‌ఫుల్‌గా ముగించాలంటే స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించడం మంచిదనే అభిప్రాయంలో ఉంది.

స్టేడియంలోకి ప్రేక్షకుల్నిఅనుమతించడంపై ఉన్న అవకాశాల గురించి తాజాగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సెక్రటరీ ముబాషిర్ ఉస్మానీ మాట్లాడుతూ ‘‘కరోనా వైరస్ నియంత్రణ విషయంలో యూఏఈ ప్రభుత్వం చాలా మెరుగ్గా పనిచేసింది. దాంతో.. ఇప్పుడు దేశంలో వైరస్ పూర్తిగా నియంత్రణలో ఉంది. కాబట్టి.. మేమంతా ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నాము. ఇక ఐపీఎల్‌ విషయంలో భారత ప్రభుత్వం నుంచి కచ్చితమైన అనుమతి వచ్చిందని మాకు బీసీసీఐ చెప్తే..? అప్పుడు పూర్తి స్థాయిలో అన్ని ప్రతిపాదనల్ని యూఏఈ ప్రభుత్వం ముందు ఉంచుతాం. అందులో స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించే ప్రపోజల్ కూడా ఉంటుంది. నా అంచనా ప్రకారం మా ప్రభుత్వం స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతిస్తుందని అనుకుంటా’’ అని ధీమా వ్యక్తం చేశాడు. యూఏఈ ప్రభుత్వం అనుమతిస్తే..? స్టేడియంలోని కనీసం 30-50 శాతం సీట్లని ఫ్యాన్స్‌తో నింపే ఆలోచనలో యూఏఈ క్రికెట్ బోర్డు ఏసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. అలానే స్టేడియంలో ప్రేక్షకుల మధ్య సామాజిక దూరం తప్పనిసరి చేయనున్నారు. యూఏఈలో ప్రస్తుతం ఆరువేల కరోనా కేసులు మాత్రమే ఉన్నాయి.