ఐపీఎల్ 2020కి మయాంతి లాంగర్ దూరం.. కారణం తాజాగా వెలుగులోకి

Share Icons:
మయాంతి లాంగర్.. స్టార్ స్పోర్ట్స్‌ చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు. అందంతో పాటు చక్కటి వాక్‌చాతుర్యంతో ఆకట్టుకునే మయాంతి లాంగర్‌కి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అయితే.. ఐపీఎల్ 2020కి మయాంతి దూరంగా ఉండనుందని తాజాగా స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో ప్రకటించగా.. ఆమెకి ఏమైంది..? అంటూ నెటిజన్లు తెగ వెతికేశారు. దాంతో.. స్వయంగా రంగంలోకి దిగిన మయాంతి.. తాను టోర్నీకి దూరంగా ఉండటానికి గల కారణాన్ని వెల్లడించింది.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. మ్యాచ్‌కి ముందు, ఇన్నింగ్స్ బ్రేక్, మ్యాచ్ ముగిసిన తర్వాత స్టూడియోలో జరిగే చర్చల్లో మయాంతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. సుదీర్ఘకాలంగా స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌లో పనిచేస్తున్న మయాంతి.. భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య.

ఐపీఎల్ 2020 సీజన్‌ని తాను ఇంట్లో ఉండి చూడనున్నట్లు తాజాగా వెల్లడించిన .. తనకి ఆరు వారాల క్రితం బాబు పుట్టినట్లు ఆలస్యంగా చెప్పుకొచ్చింది. వాస్తవానికి గతంలో స్టువర్ట్ బిన్నీ కారణంగా మయాంతి విమర్శలు ఎదుర్కొంది. బిన్నీని విమర్శించిన వారికి బదులిచ్చే క్రమంలో ఆమె సహనం కోల్పోయింది. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో నెటిజన్లకి ఘాటు సమాధానాలిస్తూ ఆమె వార్తల్లో నిలుస్తూ వచ్చింది. బహుశా ఈ వివాదాల కారణంగానే తాను గర్భవతి అనే విషయాన్ని ఈ స్టార్ యాంకర్ గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.