ఐపీఎల్ 2020కి పూర్తిగా టచ్‌లోకి వచ్చేసిన విరాట్ కోహ్లీ..!

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ పూర్తిగా మ్యాచ్ టచ్‌లోకి వచ్చేశాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌తో దుబాయ్ వేదికగా బెంగళూరు తలపడనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే బ్యాటింగ్‌లో మునుపటి లయని అందుకున్న విరాట్ కోహ్లీ.. ఫీల్డింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఈ మేరకు రెండు ఫొటోల్ని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంటూ ‘‘ఫోకస్’’ అంటూ కోహ్లీ క్యాప్షన్ రాసుకొచ్చాడు.

ఐపీఎల్ టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా 5,412 పరుగులతో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. 2019 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడి 464 పరుగులు చేశాడు. కానీ.. అతను కెప్టెన్సీ వహిస్తున్న బెంగళూరు టీమ్ కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. దాంతో.. 2016 ఐపీఎల్ సీజన్ తరహాలో ఈసారి బ్యాటింగ్‌లో చెలరేగిపోవాలని కోహ్లీ ఆశిస్తున్నాడు. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేసి ఒంటిచేత్తో టీమ్‌ని ఫైనల్‌కి చేర్చాడు. కానీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి కొద్దిలో ఆ జట్టు టైటిల్‌ని చేజార్చుకుంది. ఆతర్వాత మూడు సీజన్లలోనూ కోహ్లీ వరుసగా 308, 530, 464 పరుగులు చేశాడు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత మార్చి నుంచి క్రికెట్‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ ఆగస్టు చివరి వారం నుంచి మళ్లీ ప్రాక్టీస్ మొదలెట్టాడు. కొన్ని నెలలు ఆటకి దూరంగా ఉన్నా.. గంటల వ్యవధిలోనే తాను బంతిని బ్యాట్‌కి మిడిల్ చేయగలిగానని బాహాటంగా చెప్పుకొచ్చిన కోహ్లీ.. తాజాగా తన మార్క్ కవర్‌ డ్రైవ్ ఆడిన ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. మరి ఈ ఆర్సీబీ కెప్టెన్ ఐపీఎల్ 2020 సీజన్‌లో ఎలా రాణిస్తాడో..? చూడాలి.