ఐపీఎల్ ఫ్రాంఛైజీలకి బీసీసీఐ దిశానిర్దేశం.. సేప్టీ ఫస్ట్

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్‌ నిర్వహణపై టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా దిశానిర్దేశం చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఆగస్టు 20 తర్వాతే అక్కడికి టీమ్స్ వెళ్లనున్నాయి. జట్లని అక్కడికి పంపడం నుంచి టోర్నీలో ఆఖరి బంతి పడే వరకూ ఆటగాళ్లకి సురక్షిత వాతావరణం కల్పించడం ఫ్రాంఛైజీల బాధ్యత అని స్పష్టం చేసిన .. మొత్తం 16 పేజీల డాక్యుమెంట్‌ని పంపినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2020 సీజన్ 53 రోజులపాటు జరగనుండగా.. మొత్తం 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. దాంతో.. టోర్నీ సమయంలో క్రికెటర్లతో పాటు కుటుంబ సభ్యులు ఉండేందుకు అనుమతించడం ఫ్రాంఛైజీల ఇష్టమని తేల్చి చెప్పేసిన బీసీసీఐ.. ఒకవేళ అనుమతిస్తే..? తప్పనిసరిగా సేప్టీ ప్రొటోకాల్‌ని వాళ్లు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2020 సీజన్‌ని పూర్తి- బయో సెక్యూర్ వాతావరణంలో బీసీసీఐ నిర్వహిస్తుండగా.. ఈ సెక్యూర్ బబుల్‌లోకి ఒకసారి క్రికెటర్ ఎంటరైన తర్వాత.. బబుల్‌ వెలుపలి వ్యక్తుల్ని టోర్నీ ముగిసే వరకూ కలిసేందుకు క్రికెటర్‌ని అనుమతించరు. టోర్నీకి ముందు ఆటగాళ్లని క్వారంటైన్‌లో ఉంచి.. కరోనా వైరస్ పరీక్షల అనంతరం ఈ బబుల్‌లోకి చేరుస్తారు. ఇదే తరహాలో కుటుంబ సభ్యుల్ని కూడా ఫ్రాంఛైజీలు బబుల్‌లోకి చేర్చాల్సి ఉంటుంది.

ఐపీఎల్‌లో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా.. యూఏఈలో ప్రతి జట్టునీ సపరేటు హోటల్‌లో ఉంచాలని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ సూచించింది. అలానే టోర్నీ సమయంలో ప్రతి ఐదు రోజులకి ఒకసారి క్రికెటర్లకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఫ్రాంఛైజీలకి బీసీసీఐ అప్పగించించింది. మొత్తంగా.. టోర్నీ విజయవంతంగా ముగిసేందుకు సేప్టీ ఫస్ట్ నినాదంతో ఫ్రాంఛైజీలు పనిచేయాలని బీసీసీఐ సూచించింది.