ఐపీఎల్ పాయింట్ల పట్టిక… టాప్-4 నో SRH, CSK

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. ఓటమితో టోర్నీలో తన జర్నీని ఆరంభించిన ముంబయి టీమ్.. వరుస విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నెం.1 స్థానానికి దూసుకెళ్లింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల లక్ష్యాన్ని.. 16.5 ఓవర్లలోనే 149/2తో ముంబయి ఛేదించేసింది. దాంతో.. మెరుగైన నెట్ రన్‌రేట్ సాయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ని వెనక్కి నెట్టిన ముంబయి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ముంబయి తరహాలో ఢిల్లీ కూడా 8 మ్యాచ్‌లాడి ఆరింట్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ (12), ఢిల్లీ క్యాపిటల్స్ (12), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (10), కోల్‌కతా నైట్‌రైడర్స్ (8) టాప్-4లో నిలవగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచాయి. బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో గురువారం గెలిచిన పంజాబ్ తన ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంది. మొత్తంగా.. టోర్నీలోని అన్ని జట్లూ ప్రస్తుతం ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి.

ఈరోజు రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు మధ్య దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి ఫస్ట్ మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య షార్జా వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోతే పట్టికలో ఆరు నుంచి ఏడుకి పడిపోయే అవకాశం ఉంది. ఢిల్లీ గెలిస్తే.. పట్టికలో మళ్లీ ఆ టీమ్ నెం.1 స్థానాన్ని దక్కించుకుంటుంది.