ఐపీఎల్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్ల క్వారంటైన్‌ గడువు గంటలకి కుదింపు

Share Icons:
సీజన్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు గురువారం రాత్రి యూఏఈకి చేరుకున్నారు. సెప్టెంబరు 19 నుంచి దుబాయ్, షార్జా, అబుదాబి వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇంగ్లాండ్ గడ్డపై ఈ రెండు జట్ల మధ్య టీ20, వన్డే సిరీస్ బుధవారం రాత్రి ముగిసింది. దాంతో.. మాంచెస్టర్ నుంచి నేరుగా ఆటగాళ్లని స్పెషల్ ఛార్టర్ ప్లైట్‌లో యూఏఈకి బీసీసీఐ తరలించింది.

ఐపీఎల్‌లో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా.. ఒక్క ముంబయి ఇండియన్స్ మినహా మిగిలిన ఏడు జట్లకి సంబంధించిన ఆటగాళ్లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్‌లో ఉన్నారు. దానికితోడు.. ఛార్టర్డ్ ప్లైట్‌లో.. పీపీఈ కిట్లు ధరించి మరీ ఆటగాళ్లు ప్రయాణం చేసి ఉన్నందున క్వారంటైన్ గడువుని తగ్గించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యూఏఈ అధికారుల్ని కోరింది. దాంతో.. యూఏఈ అధికారులు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లకి క్వారంటైన్ గడువుని 36 గంటలకి కుదించారు. సాధారణంగా యూఏఈలో ఆరు రోజుల క్వారంటైన్ నిబంధన అమలవుతోంది. ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్‌ని బయో- సెక్యూర్ వాతావరణంలో ఆడి ఉండటం కూడా ఈ రెండు జట్ల ఆటగాళ్లకి కలిసిరానుంది.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఒకవేళ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటరు వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తే.. ఆరంభ మ్యాచ్‌లకి వారు దూరంగా ఉండేవారు. అదే జరిగితే.. ముంబయి మినహా మిగిలిన అన్ని జట్లపైనా ఆ ప్రభావం ఉండేది. ముఖ్యంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ తమ కెప్టెన్లు డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్ లేకుండానే మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చేది.