ఈ ఫొటో పాతది.. ఇప్పటి ఎన్టీఆర్‌ను చూస్తే దిమ్మతిరిగిపోద్ది!

Share Icons:
ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ దబ్బూ రత్నాని సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా గత కొద్ది నెలలుగా తన మెమొరీస్‌ని దబ్బూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన సెలబ్రిటీలతో తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. ఎప్పుడో ‘త్రి ఇడియట్స్’ సినిమా ఫొటోషూట్‌లో కరీనా కపూర్‌తో తీసుకున్న ఫొటోను ఆదివారం షేర్ చేశారు. అలాగే, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తీసుకున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. అయితే, ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దబ్బూ రత్నాని షేర్ చేసిన ఫొటోలో తారక రాముడు కండలు తిరిగి ఉన్నాడు. హ్యాండ్‌సమ్ లుక్‌లో కట్టిపడేస్తున్నాడు. అయితే, ఈ ఫొటో ఇప్పటిది కాదు. ‘అరవింద సమేత’ షూటింగ్ సమయంలో తీసిన ఫొటోషూట్‌లోనిది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సన్నిహితుడు, నిర్మాత మహేష్ ఎస్. కోనేరు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. ‘‘అరవింద సమేతలో ఫేమస్ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ఈ ఎన్టీఆర్ ఫొటోను దబ్బూ రత్నాని తీశారు. ప్రస్తుతం భీమ్ ఫిజిక్ ఇంత కన్నా కండలు తిరిగి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

కాగా, ఈనెల 23న ‘భీమ్’ ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం తెలిసిందే. RRR సినిమా నుంచి కొమరం భీమ్ ఫస్ట్ లుక్‌ను 23న విడుదల చేయనున్నట్టు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. ఎన్టీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రామ్ చరణ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్‌కు ఎన్టీఆర్ ఇచ్చిన అల్లూరి సీతారామరాజు గిఫ్ట్ ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ వాయిస్, చరణ్ లుక్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు భీమ్‌కు రామరాజు ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.