ఈల వేసింది ఎవరు..? ధోనీ ముందు జాదవ్‌ని ఇరికించిన జడేజా

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట సోషల్ మీడియాలో సందడి తారాస్థాయికి చేరింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై ఆటగాళ్లు ధరించే జెర్సీని తాజాగా విడుదల చేసిన ఆ ఫ్రాంఛైజీ.. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్వయంగా ఈల వేస్తున్న వీడియోని దానికి జత చేసింది. కానీ.. మరో పోస్ట్‌లో టీమ్‌లోని ఆటగాళ్లంతా ధోనీ ముందు కేదార్ జాదవ్‌ని ఇరికించేసిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

చెన్నై టీమ్‌‌లోని బ్యాట్స్‌మెన్‌లు డుప్లెసిస్, మురళీ విజయ్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజాలకి ధోనీ క్లాస్ పీకుతుండగా.. మధ్యలో ఎవరో ఒక విజిల్ వేశారు. దాంతో.. ‘‘నా క్లాస్‌లో ఈల వేసింది ఎవరు..?’’ అని ధోనీ ప్రశ్నించగా.. అందరూ కలిసి ఏకపక్షంగా ‘‘ఈ కుర్రాడే సార్’’ అని కేదార్ జాదవ్‌‌‌ని ఇరికించేశారు. దాంతో.. సమాధానం చెప్పుకోలేని స్థితిలో జాదవ్ చూస్తుండటం ఫొటోలో కనిపిస్తోంది.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. తొలి మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్‌తో అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఆడిన అన్ని సీజన్లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ని కెప్టెన్‌గా ధోనీ కనీసం ప్లేఆఫ్‌కి చేర్చిన విషయం తెలిసిందే. టోర్నీ చరిత్రలో ఈ తరహాలో ఏ జట్టూ ఆడిన ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కి చేరలేదు.