ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్‌కి కరోనా పాజిటివ్.. ఫస్ట్ క్రికెటర్

Share Icons:
ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన డేవిడ్ విల్లీ.. ప్రస్తుతం విటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో యార్క్‌షైర్ తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య బుధవారం రాత్రి మూడు వన్డేల సిరీస్ ముగియగా.. ఈ సిరీస్‌కి ఎంపికవలేదు. ఇంగ్లాండ్ తరఫున 48 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లను విల్లీ ఆడాడు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఐపీఎల్‌లో ఆడేందుకు డేవిడ్ విల్లీ నిరాకరించాడు. విటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో ఆఫర్ రావడంతోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గతంలో డేవిడ్ విల్లీ మ్యాచ్‌లు ఆడాడు.

ఇంగ్లాండ్ జట్టులోని ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్‌కి కరోనా వైరస్ సోకడం ఇదే తొలిసారికాగా.. డేవిడ్ విల్లీతో పాటు అతని భార్యకి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఇంగ్లాండ్ గడ్డపై నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు ఛార్టర్డ్ ప్లైట్‌లో గురువారం రాత్రి యూఏఈకి వచ్చిన విషయం తెలిసిందే. పీపీఈ కిట్లు ధరించి మరీ ప్రయాణం చేసిన ఈ క్రికెటర్లకి క్వారంటైన్ గడువుని యూఏఈ ప్రభుత్వం ఆరు రోజులకి బదులుగా 36 గంటలకి కుదించింది.