ఇంగ్లాండ్‌కి ఆఖరి వన్డేలో షాక్.. 303 టార్గెట్‌ని ఊదేసిన ఆస్ట్రేలియా

Share Icons:
ఇంగ్లాండ్ గడ్డపై పర్యటన ముగిసింది. తొలుత మూడు టీ20ల సిరీస్‌ని 1-2తో చేజార్చుకున్న కంగారూలు.. తాజాగా ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ని మాత్రం 2-1తో గెలిచి ఇంగ్లాండ్ లెక్క సరిచేశారు. మాంచెస్టర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 305/7తో ఛేదించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్ జేసన్ రాయ్ (0), జో రూట్ (0)లను ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మొదటి ఓవర్‌ తొలి రెండు బంతుల్లోనే గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌ బాట పట్టించాడు. అయితే.. మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (112: 126 బంతుల్లో 12×4, 2×6) పట్టుదలతో క్రీజులో నిలిచి సెంచరీ బాదగా.. ఇయాన్ మోర్గాన్ (23), జోస్ బట్లర్ (8) అంచనాల్ని అందుకోలేకపోయారు. కానీ.. ఆఖర్లో శామ్ బిల్లింగ్స్ (57: 58 బంతుల్లో 4×4, 2×6), క్రిస్‌వోక్స్ (53 నాటౌట్: 39 బంతుల్లో 6×4) హాఫ్ సెంచరీలు బాదడంతో ఇంగ్లాండ్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు.

303 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (24: 32 బంతుల్లో 3×4), అరోన్ ఫించ్ (12), మార్కస్ స్టాయినిస్ (4), లబుషేన్ (20), మిచెల్ మార్ష్ (2) నిరాశపరచడంతో.. ఆ జట్టు 16.5 ఓవర్లు ముగిసే సమయానికి 73/5తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. అయితే.. ఈ దశలో ఇంగ్లాండ్ బౌలర్లకి ఎదురునిలిచిన గ్లెన్ మాక్స్‌వెల్ (108: 90 బంతుల్లో 4×4, 7×6), అలెక్స్ క్యారీ (106: 114 బంతుల్లో 7×4, 2×6) జోడీ.. శతకాలతో చెలరేగిపోయింది. ఆరో వికెట్‌కి అభేద్యంగా 212 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జంట ఆఖర్లో ఓవర్‌ వ్యవధిలోనే ఔటైనా.. మిచెల్ స్టార్క్ (11 నాటౌట్: 3 బంతుల్లో 1×4, 1×6) బౌండరీతో గెలుపు లాంఛనాన్ని 49.4 ఓవర్లలో పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోరూట్, క్రిస్‌వోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. జోప్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ ఒక్కో వికెట్ తీశారు.