ఆ షోలో 5 కోట్లు గెలిచాక జీవితం దరిద్రంగా తయారైంది.. కౌన్ బనేగా క్రోర్‌పతి విన్నర్ షాకింగ్ కామెంట్స్

Share Icons:
గత దశాబ్ద కాలంగా బుల్లితెర రియాలిటీ షోస్ ప్రేక్షకులకు బాగా ఆకర్షిస్తున్నాయి. పైగా ఈ షోల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి భారీ మొత్తంలో ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో పార్టిసిపేట్ చేయాలని ఎంతో ఉత్సాహంగా ప్రయత్నిస్తున్నారు ఆడియన్స్. అప్పట్లో వచ్చిన కోన్ బనేగా క్రోర్‌పతి నుంచి మొదలుకొని నేటి బిగ్ బాస్ షో వరకు అన్ని షోస్ విజేతలకు భారీగా సొమ్ము చెల్లిస్తున్నాయి. అలా గెలిచిన ఆ డబ్బుతో జీవితం ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందుకు బిన్నంగా ఆ సొమ్ము తన జీవితాన్ని నాశనం చేసిందంటూ విన్నర్ షాకింగ్ పోస్ట్ పెట్టాడు.

2011లో కౌన్ బనేగా క్రోర్‌పతి విజేతగా నిలిచి 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఆ డబ్బు వల్ల పడిన కష్టాల గురించి ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించాడు. కౌన్ బనేగా క్రోర్‌పతిలో తాను గెలిచిన సొమ్ముతో జీవితం దరిద్రంగా తయారైందని పేర్కొంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. మందు, సిగరెట్స్ లాంటి వ్యసనాలకు అలవాటు పడి, మోసగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయానని చెబుతూ నివ్వెరబోయే విషయాలు తెలిపాడు.

ఆ 5 కోట్లు వచ్చాక తీసుకున్న కొన్ని చెత్త నిర్ణయాలు తన జీవితాన్ని సర్వనాశనం చేశాయని, ఆ కారణంగా భార్యతో కూడా మనస్పర్థలు వచ్చి విడిపోయానని తెలుపుతూ సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశాడు సుశీల్. ఆ సొమ్మును కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడుల రూపంలో పెట్టి దారుణంగా నష్టపోయానని తెలిపాడు. చివరకు ఓ ప్రముఖ వ్యక్తిగా ఉండడం కంటే మంచి మనిషిగా ఉండడం వేల రెట్లు గొప్పదని తెలుసుకొని టీచర్‌గా తిరిగి జీవితాన్ని మొదలుపెట్టానని ఆయన పేర్కొన్నాడు.

Also Read:
5 కోట్లు వచ్చాక సుశీల్ ఎదుర్కొన్న సవాళ్ళను బట్టి చూస్తే డబ్బు మనిషికి ఎంత మేలు చేస్తుందో అంతే కీడు కూడా చేస్తుందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం సుశీల్ కుమార్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.