ఆయన తెలుగు వాడంటే ఒప్పుకునేవారు కాదు: బాలు గురించి రాజమౌళి

Share Icons:
దిగ్గజ గాయకుడు, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి మన మధ్య లేరంటే ఇప్పటికీ నమ్మలేని విషయం. ఆయన ఇంకా మనతోనే ఉన్నారని అంతా ఊహించుకుంటున్నారు. ఆయన పాటతో మనతో ఉన్నంత కాలం ఆయన మనల్ని విడిచి వెళ్లరని అభిమానులు అంటున్నారు. ఆ అభిమానుల్లో సినీ ప్రముఖులు ఉన్నారు. ఎస్పీ బాలు మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

బాలుతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి వీడియో రూపంలో ప్రేక్షకులకు తెలియజేశారు. అయితే, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. బాలసుబ్రహ్మణ్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవి చదువుతుంటే బాలు ప్రత్యేకత ఏంటో.. ఆయన గొప్పతనం ఏంటో నేటి తరానికి తెలుస్తుంది.

Also Read:

‘‘బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. చాలామంది తమిళ కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు. అన్ని భాషలలోను పాడారు. అందరిచేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

రాజమౌళి తెలుగువారే కానీ.. ఆయన పుట్టి పెరిగింది కర్ణాటకలో. కన్నడిగులతో మంచి సంబంధాలున్నాయి. బాలు తమ వాడని అక్కడి వాళ్లు ఎలా వాదించేవారో రాజమౌళి తన ట్వీట్లో చెప్పుకొచ్చారు. కన్నడిగులు ఓ మాదిరిగా పర్వాలేదు.. తమిళులైతే బాలు తెలుగువాడు అంటే అస్సలు ఒప్పుకోరు. నిజానికి ఆయన హైదరాబాద్‌లో కన్నా చెన్నైలో ఉన్నదే ఎక్కువ. బాలు అంటే తమిళులకు ఎంతో ప్రీతి. వాస్తవం ఏంటంటే.. ఉత్తరాదిలో చాలా మంది బాలుని తమిళవారేనని అనుకుంటారు. ప్రస్తుతం ఆయన చెన్నైలో కన్నుమూయడం, అంత్యక్రియలు కూడా అక్కడే జరుగుతుండటంతో ఆయన తెలుగువారనే భావన ఉత్తరాది వాళ్లకు ఎలా కలుగుతుంది. కానీ, బాలు తెలుగువారు అయినందుకు మనందరం గర్వపడాలి.. ఆయన మావాడు అని గర్వంగా చెప్పుకోవాలి.