అలా అడిగితే పది రోజులు దుప్పటి కిందే.. ఎంతో ఆందోళన చెందా కానీ: రష్మిక మందన

Share Icons:
‘ఛలో’ అంటూ టాలీవుడ్ గడపతొక్కిన కన్నడ భామ .. ప్రస్తుతం తెలుగు తెరపై క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అందం, అభినయం రెండు పుష్కలంగా ఉండటంతో ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. వరుసగా ”గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు” లాంటి భారీ సక్సెస్‌లు ఖాతాలో వేసుకొని అనతికాలంలోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్. ఈ క్రమంలోనే తన జీవితంలో ఎదుర్కొన్న అభద్రతా భావాలు, వాటి నుంచి ఎలా బయటపడగలిగాను అనే దానిపై సుదీర్ఘమైన పోస్ట్ చేసింది రష్మిక.

”ఓ మనిషిగా చెబుతున్నా.. కొన్నిసార్లు మన గురించో, ఇతరుల గురించో ఆలోచిస్తూ అభద్రతకు గురవుతుంటాం. అవసరం లేని విషయాల గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటాం. బరువు పెరుగుతున్నానా? లేదా మరీ సన్నగా ఉన్నానా? నా చర్మం జిడ్డుగా ఉందా? రఫ్‌గా ఉందా? అని స్నేహితులను పదే పదే అడుగుతుంటాం. ఒకవేళ వాళ్ళు గనక పొరపాటున నీ ముఖానికి ఏమైంది? అని అడిగారో.. ఆ తర్వాత పది రోజులు దుప్పటి కిందే ఉంటాం తప్ప బయటకు రావడానికి ఇష్టపడం. నిజాయతీగా చెప్పాలంటే.. లాక్‌డౌన్‌ సమయంలో నేనూ అభద్రతా భావానికి లోనయ్యా. నా పని, శరీరాకృతి, మానసిక ఆరోగ్యం ఇలా ప్రతి విషయం గురించీ ఆందోళన చెందా. కానీ అది కరెక్ట్ కాదని చివరకు తెలుసుకున్నా” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది రష్మిక మందన.

Also Read:
అందుకే అందరికీ తాను చెప్పదలచుకుంది ఒక్కటే అని.. అభద్రతకు గురి చేసే విషయాలను బలాలుగా మార్చుకొని ముందు మిమ్మల్ని మీరు నమ్మండి అని పేర్కొంది రష్మిక. ఈ మేరకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అంటూ తన అభిమానుల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించే విధంగా సందేశమిచ్చింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది రష్మిక. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పల్లెటూరు పిల్లగా రష్మిక రోల్ స్పెషల్ కిక్కిస్తుందని తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది.