అమ్మాయి ఇష్టం.. ఎవ్వరినీ ఫోర్స్ చేయరు: క్యాస్టింగ్ కౌచ్‌పై నందిని రాయ్ సంచలన వ్యాఖ్యలు

Share Icons:
హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నందిని రాయ్.. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా పాపులర్ అయ్యారు. హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా.. బిగ్ బాస్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ సంపాదించినా తెలుగులో ఆమెకు ఆఫర్లు పెద్దగా రావడంలేదు. అయితే తమిళం, కన్నడ, మలయాళంలో తనకు అవకాశాలు వస్తు్న్నాయని నందిని చెబుతున్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ‘హలో’ యాప్‌ నిర్వహించిన లైవ్‌లో పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

‘క్షణం’లో ఛాన్స్ మిస్ చేసుకున్నా..
నందిని రాయ్ 2015లో ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అయితే, ఈ సినిమా తరవాత మూడేళ్లకు నందిని బిగ్ బాస్‌ షోలో కనిపించారు. అంటే, ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి తరవాత ఆఫర్లు రాలేదా అంటే.. అదేంకాదు అంటున్నారు నందిని రాయ్. ‘‘అడవి శేష్ గారి ‘క్షణం’ సినిమాకు నన్ను అడిగారు. అప్పటికే నేను హయ్యర్ స్టడీస్ కోసం లండన్ వెళ్లాను. అదా శర్మ క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు. నేనెంత పిచ్చిదాన్ని అంటే.. క్షణం లాంటి సినిమాను వదులుకొని హయ్యర్ స్టడీస్ కొనసాగించాను’’ అని నందిని చెప్పుకొచ్చారు.

‘మోసగాళ్లకు మోసగాడు’ తరవాత తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని నందిని అన్నారు. రెండు సంవత్సరాలు మానసికంగా దృఢంగా లేనని, అందుకే లండన్ వెళ్లిపోయానని చెప్పారు. ఆ తరవాత మళ్లీ వెనక్కి వచ్చి ‘గగనం’ సినిమా తమిళంలో, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కన్నడలో చేసిన తరవాత బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చిందన్నారు. తన చేతులారా రెండు సార్లు మంచి అవకాశాలను వదులుకున్నానని నందిని తెలిపారు. అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’లో కూడా శీరత్ కపూర్ క్యారెక్టర్ తాను చేయాల్సిందేనని అన్నారు.

క్యాస్టింగ్ కౌచ్‌పై..
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం తనకు ఎప్పుడూ ఎదురవలేదని నందిని రాయ్ అన్నారు. ‘‘అయ్యో వాళ్లను అడిగారు.. వీళ్లను అడిగారు అని ఇండస్ట్రీ గురించి చాలా మంది అంటారు. నిజానికి అలా ఏం ఉండదు. అడిగేవాళ్లు అడుగుతారు. యస్ చెప్పడమా.. నో చెప్పడమా అనేది ఒక అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది. అమ్మాయి ఇష్టం. ఒక అమ్మాయి వెళ్లాలి అనుకుంటే వెళ్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే నో చెప్తుంది. ఎప్పుడూ ఎవరు ఎవరినీ ఫోర్స్ చేయరు. నేను కళ్లతో చూశాను కాబట్టి చెబుతున్నాను’’ అని క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడారు నందిని.

క్యాస్టింగ్ కౌచ్ అనేది అన్నిచోట్ల ఉందని నందిని అన్నారు. ‘‘ఐటీ కంపెనీల్లో లేదా? మెడికల్ సీట్స్ రావడానికి అడగట్లేదా? పోలీస్ జాబ్స్ రావడానికి అడగట్లేదా? అన్ని చోట్లా ఇది ఉంది. ఇది కేవలం ఇండస్ట్రీలోనే ఉంది అనడం తప్పు. చాలా మంది ఐటీ అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కోవడం నేను చూశాను. నాకు చాలా మంది ఐటీ ఫ్రెండ్స్ ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్లు చెబుతుంటే నిజంగా ఇండస్ట్రీ బెటర్ అనిపిస్తుంది. ఏదేమైనా ఇది అమ్మాయి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది’’ అని నందిని కుండబద్దలు కొట్టారు.