అమితాబ్‌కు కరోనా నెగిటివ్: హాస్పిటల్ నుంచి బిగ్ బి డిశ్చార్జ్.. కానీ అభిషేక్!

Share Icons:
బాలీవుడ్ బిగ్ బి కుటుంబం కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరంతా ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చేరారు. ఇప్పటికే ఐశ్వర్యరాయ్, ఆరాధ్యకు నెగిటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు (ఆగస్టు 2న) అమితాబ్ బచ్చన్‌కు కొవిడ్ నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే, తనకు మాత్రం పాజిటివ్ వచ్చిందని చెప్పారు.

Also Read:

‘‘తాజాగా చేసిన కొవిడ్-19 పరీక్షలో మా నాన్నకు నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఆయన ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటారు. ఆయన కోలుకోవాలని కోరుకున్న, ప్రార్థనలు చేసిన వారికి ధన్యవాదాలు’’ అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. అయితే, తాను కరోనా నుంచి ఇంకా కోలుకోలేదని మరో ట్వీట్‌లో వెల్లడించారు.

‘‘దురదృష్టవశాత్తు నాకు మళ్లీ కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నేను హాస్పిటల్‌లోనే ఉన్నాను. నా కుటుంబం కోలుకోవాలని నిరంతరం కోరుకుంటోన్న, ప్రార్థనలు చేస్తోన్న వారికి మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ రుణపడి ఉంటాం. ఈ కరోనాను నేను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను. ప్రామిస్’’ అని అభిషేక్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. అమితాబ్‌కు కొవిడ్ నెగిటివ్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

కాగా, బచ్చన్ ఫ్యామిలీలో మొదట అమితాబ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ వెంటనే అభిషేక్ రిపోర్ట్ కూడా పాజిటివ్ అని వచ్చింది. జులై 11న అమితాబ్, అభిషేక్ బచ్చన్ నానావతి హాస్పిటల్‌లో చేరారు. వీరిద్దరికీ పాజిటివ్ రావడంతో బచ్చన్ ఫ్యామిలీలోని అందరికీ కొవిడ్-19 పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలకు పాజిటివ్ అని తేలింది. జయా బచ్చన్‌కు, వీరితో పాటు ఉంటోన్న కుమార్తె కుటుంబానికి నెగిటివ్ వచ్చింది. ఆ తరవాత వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందిన ఐశ్వర్య, ఆరాధ్య.. జులై 17న నానావతి హాస్పిటల్‌లో చేరారు. జులై 27న వీరిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు.