అభ్యుదయ శాస్త్రవేత్త పుష్పమిత్ర భార్గవ – అశ్రు నివాళి

అభ్యుదయ శాస్త్రవేత్త పుష్పమిత్ర భార్గవ – అశ్రు నివాళి
Views:
67

ప్రముఖ శాస్త్రవేత్త, సీసీఎంబీ వ్యవస్థాపకుడు, భారతదేశ ఆధునిక జీవశాస్త్ర రూపశిల్పిగా గుర్తింపు పొందిన పి.ఎం.భార్గవ(89) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌ ఉప్పల్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పరిశోధన సంస్థ సీసీఎంబీ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన భార్గవ 13 ఏళ్ల పాటు ఆ సంస్థకు సంచాలకుడిగా వ్యవహరించారు. పద్మభూషణ్‌ సహా 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.

అజ్‌మేర్‌లో పుట్టిన భార్గవ వారణాసి, లఖ్‌నవూల్లో విద్యాభాస్యం పూర్తిచేశారు. 1944లో బీఎస్సీ, 1946లో ఎంఎస్సీ పూర్తి చేశారు. 21 ఏళ్లకే లక్నో విశ్వవిద్యాలయం నుంచి సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పొందారు. లఖ్‌నవూ విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రం బోధించేవారు. అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చారు. 23 ఏళ్ల వయసులోనే 14 పరిశోధనపత్రాలను ప్రచురించారు.

పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌తో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌గా అమెరికాలో క్యాన్సర్‌ పరిశోధనలో పాలుపంచుకున్నారు. యాంటీ డ్రగ్‌ ఆవిష్కరణలో కీలకంగా వ్యవహరించారు. బ్రిటన్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో పనిచేశారు. 1958లో హైదరాబాద్‌ వచ్చిన భార్గవ రీజినల్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ(ప్రస్తుతం ఐఐసీటీ)లో శాస్త్రవేత్తగా చేరారు.

పుష్ప మిత్ర భార్గవ భారతదేశంలోనే ఉన్నత స్థాయి శాస్త్రవేత్తగా పేరు పొందారు. జాతి నిర్మాతల్లో ఒకరిగా పేరొందారు. ఈయన సేవలకు గాను భారతప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా ప్రదానం చేసింది. అయితే దేశంలో నెలకొన్న అసహన పరిస్థితుల నేపథ్యంలో ఈ పురస్కారాన్ని 2015లో తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన భారత భవిష్యత్‌పై అసంతృప్తితో ఉన్నానని, దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే...భారత్‌ మరో పాకిస్తాన్‌లా తయారౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుతో పాటు తన ఆవేదనను కేంద్ర హోం శాఖకు పంపారు.

సైంటిస్టుగానే కాకుండా జనం కోసం కూడా పనిచేసిన మహా మనిషి భార్గవ. ప్రజలకు ఉపయోగపడే అంశాలపైనే ఆయన ఎక్కువ ప్రయోగాలు చేసేవారు. మూఢనమ్మకాల నిర్మూలనకు ఆయన ఎంతో కషి చేశారు. సైంటిస్టుల్లో ఉన్న మూఢనమ్మకాలపై కూడా ఆయన అధ్యయనం చేసి వాటిని పోగొట్టేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. నేషనల్‌ నాలెడ్జ్‌ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌గా పనిచేసిన భార్గవ, ప్రభుత్వానికి విలువైన సూచనలు చేశారు. శాస్త్రవిజ్ఞానాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న విశాల ధక్పథంతో వ్యవహరించారు.

భార్గవ నేతృత్వంలో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)ని హైదరాబాద్ లో స్థాపించిన తర్వాత అనేక గొప్ప ఆవిష్కరణలు చేశారు.

ఈ ఏడాది జనవరిలో తిరుపతిలో జరిగిన సైన్స్‌ కాంగ్రెస్‌ జరుగుతున్న సందర్భంలో సైన్స్‌ కాంగ్రెస్‌లో సైన్స్‌ లేదంటూ భార్గవ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూడో సైన్స్‌ను ప్రచారం చేస్తున్న శాస్త్రవేత్తల డిగ్రీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

అభ్యుదయ శాస్త్రవేత్త సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ ( సిసిఎంబి ) వ్యవస్థాపక డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పుష్ప మిత్ర భార్గవ గారి అకాల మరణానికి చింతిస్తూ వారికి అశ్రు నివాళి. 

 • సాహితీ రత్న 
(Visited 18 times)

2 Comments

 1. వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి

  వయోభారం, అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం (01.07.2017) సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ నందలి ప్రశాంత్ నగర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచిన పి.యం. (పుష్ప మిత్ర) భార్గవ్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సిసియంబి) వ్యవస్థాపక డైరెక్టర్ గా విజ్ఞాన రంగలో ఎనలేని సేవలందించడమే కాకుండా సామాజంలో పేరుకుని, పాతుకుని ఉన్న మూఢ విశ్వాసాల మీదా తుది వరకు అలుపెరుగుని పోరాటాలు చేశారు.

  మనందరి మనఃపురస్కారాలకు చేరువై తీరందాటిన ‘పుష్ప మిత్ర భార్గవ్’ గారికి మనఃపూర్వక నివాళి ఘటిద్దాం…

  అంతములేని యీ భువనమంత పురాతన పాంథశాల, వి
  శ్రాంతి గృహంబు, నందు నిరుసంజలు రంగుల వాకిళుల్, ధరా
  క్రాంతులు పాదుషాలు బహురామ్ జమిషీడులు వేనకువేలుగా
  గొంత సుఖించి పోయిరెటుకో పెరవారికి చోటొసంగుచున్.

  (దువ్వూరు రామిరెడ్డి గారి ‘పానశాల’ నుండి)

  ఇక, ఆ స్పూర్తిని కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే శ్రద్ధాంజలి..

  Reply
 2. చంద్ర

  ఓ రాజకీయ నాయకుడో, సినిమా స్టారో పోతే పెడబొబ్బలు పెడ్తా రోజంతా సొల్లుగార్చే టీవీలు ఇట్టాంటి మహానుభావుల గురించి అస్సలు పట్టించుకోవు. ఎతావాతా ఒక్క మాటతో చేతులు దులుపేసు కుంటారు. మనమన్నా కాస్త పెద్దాయన్ని గౌరవించుకుందాం…

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: