అందమయిన మోసం

అందమయిన మోసం
Views:
334

మోడలింగు రంగంలో ఉన్న వారు బలవంతంగానో, స్వంతంగానో స్కిన్ షో చేయడానికి ఉద్యుక్తులు కాక తప్పదు. అటువంటి వారు ఇంటిలోనూ, సమాజంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదురుకోక తప్పదు. వారి ఇంటివారిని ఒప్పించడం కోసం, సమాజాన్ని ఒప్పించడం కోసం వారికి ఒక భావజాలం కావాలి. దానిని అందించేదానికోసం రామ్ గోపాల్ వర్మ షార్ట్ సినిమా “మేరీ బేటీ సన్నీలియోన్ బన్ నా చాహ్తీహై” ప్రయత్నం చేస్తుంది. ప్రాస్టిట్యూషన్ ఆకలిలోంచి, బీదరికంలోంచి పుడితే, పోర్న్ స్టార్ కావడం మోడలింగ్ లోంచి, అందం అనే అంశంచుట్టూ ఉన్న వ్యాపారంలోంచి పుడుతుంది. ‘స్త్రీ అందం చుట్టూ వ్యాపారం చేయడమెలా’ అన్నదే ఇక్కడ ప్రధాన విషయం. స్త్రీకి ఒక ఆత్మ ఉండకూడదు, ఒక జీవితం ఉండకూడదు, ఒక కుటుంబం వాటి బాంధవ్యాలూ ఉండకూడదు, మాతృత్వ మాధుర్యం ఉండకూడదు, ఆమె అసలు మనిషి ఏ మాత్రం కాదు, తాను అందంగా ఉండగలిగినంత కాలం డబ్బు సంపాదించగలిగిన ఒక ‘వస్తువు’ మాత్రమే అని చూపించటం కోసం, మనకు కొంత భావజాలం కావాలి. దానికి అందమైన ముసుగున్న నయా విలువలు కావాలి. వాటన్నింటినీ దాదాపుగా ఏకరువు పెడుతుందీ సినిమా.

“ఇంకొక వ్యక్తిని బలవంతంగా నీవనుకున్నట్లు జీవించమని చెప్పడమంటే, ప్రజాస్వామికతనూ, స్వేచ్ఛా జీవనాన్నీ వ్యతిరేకించడమే” అనే అయాన్ ర్యాండ్ కొటేషన్ తో సినిమా మొదలవుతుంది. కాపిటలిజం ఇటువంటి కొటేషన్స్ ని వ్యాపారం చేయడమెలాగా అన్నది ఆలోచిస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఒక పోర్న్ ఫిలిం తీయాలి. అందులో స్కిన్ షో చేయగలిగిన సన్నీలియోన్ కథానాయికగా ఉండాలి. ఒక్క సన్నీలియోన్ మాత్రమే ఇండస్ట్రీలో ఉంటే కష్టం. ఎందరో సన్నీలియోన్ లు కావాలి. అందుకు ప్రోస్టిట్యూషన్ వంటి ఆకలి బాధలు పడే అమ్మాయిల అవసరం లేదు. ఫ్యాషన్ ని ఎంచుకునే డబ్బున్న అందమైన అమ్మాయిలు కావాలి. వారిని కేవలం ఫ్యాషన్ షోలకే పరిమితం చేయకుండా ‘స్కిన్ షో’ ల వైపు మరల్చాలి. అటు నిర్మాతలకీ, ఇటు కథానాయికకూ కోట్లు కుమ్మరించగల ప్రొఫెషన్ గా దీనిని అర్థం చేయించగలగాలి అంటే ‘వ్యక్తి స్వేచ్ఛ’ వంటి పడికట్టు పదాలచుట్టూ, ‘విలువలు’ అనే మిషతో ఒక భావజాలాన్ని సృష్టించాలి. రేపు పొద్దున పోర్న్ సినిమా తీసి కోట్లు దండుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని తయారు చేయాలంటే, డబ్బుండి ఫ్యాషన్ ని తమ వృత్తిగా కొనసాగిస్తున్న అమ్మాయిలను, వారి కుటుంబ విలువలనూ, కుటుంబాల్నీ విచ్ఛిన్నం చేయగలగడం తప్ప వేరే మార్గం లేదు. కనుక ఈ సినిమాలో వ్యక్తి స్వేచ్ఛ పేరుతో స్త్రీని సెక్స్ ఆబ్జెక్టుగా చూపడం జరిగింది.

బ్యాంకు అసిస్టెంటు మేనేజరు కూతురు తాను పోర్న్ స్టార్ గా మారాలనుకుంటుంది. దానిలో “మాంచి సంపాదన” ఉందని ఆమె గుర్తించగలుగుతుంది. కానీ ఆమె కుటుంబం దానికి అడ్డం. ఆ అడ్డాన్ని తొలగించుకోవడానికి తల్లిదండ్రులతో డిస్కషన్ పెట్టి, తన కోరికకు అవసరమైన భావజాలాన్ని మాత్రమే ప్రెజెంట్ చేసి వెల్లిపోతుందా అమ్మాయి. అదీ ఈ షార్ట్ ఫిలిం. “సన్నీలియోన్ పది నిముషాలు బట్టలిప్పితే సంపాదించగలిగినంత, నీవు ఐదు సంవత్సరాలు పని చేసినా సంపాదించలేవు నాన్నా..!” అని అంటుందా అమ్మాయి. “జీవితమంటే కేవలం సంపాదన మాత్రమే” అనే ఒక ఆధిపత్య కాపిటలిస్టిక్ భావజాలమిది. “ప్రాస్టిట్యూట్” అనే పదం నుండి మనం “సెక్స్ వర్కర్” అనే పదానికి మారాము. అది కూడా అన్ని పనులలాగే ఒక గౌరవ ప్రదమైన పని అని అర్థం చేసుకున్నాం కాబట్టి. ఈ గౌరవమైన పని ద్వారా సంపాదించేవారు దాదాపు బీదరికం లో నుండి లేదా “వుమన్ ట్రాఫికింగ్” నుండి ఇందులో వచ్చి పడ్డవారే. కానీ వీరితో కాపిటలిస్ట్ లకు ఏమీ ఉపయోగం పెద్దగా ఉండదు. నిగూఢంగా, మూసిన గదులలో జరిగే ఈ చర్యలవలన ఎవరికేం ఉపయోగం ఉంటుంది?. అదే సినిమాల రూపంలో వస్తే కోట్లు సంపాదించవచ్చు. ఆకలితో, రోగాలతో పీలగా ఉండే బీద అమ్మాయిలను చూచేదెవరు?. డబ్బున్న అమ్మాయిలనైతే, ఎందరో చూస్తారు. వారిని ఫ్యాషన్ పేరుతో ఇందులోకి లాగవచ్చు. దానికి ప్రాస్టిట్యూషన్, సెక్స్ వర్కర్ వంటి పేరు కాకుండా “పోర్న్ స్టార్” అని అందమైన కాపిటలిస్టిక్ పేరు పెట్టవచ్చు. పైగా “తుమ్ రాండీ బన్తే హో..?” అని ఆమె తండ్రి అడిగితే అది మీ “పురుషాహంకారులు” కనిపెట్టిన పదమని కొట్టేస్తుంది ఆ అమ్మాయి. రాండీని కనిపెట్టిన భావజాలమే పోర్న్ స్టార్ అనే పదాన్నీ కనిపెట్టిందని గుర్తించలేని పరిస్థితి ఆమెది. కోట్ల ప్రజలు పోర్న్ సినిమాలు చూస్తున్నారు కాబట్టి పోర్న్ స్టార్ గా మారాలనుకుంటుంది ఆ అమ్మాయి. సెక్స్ భగవంతుడు ఇచ్చిన సహజమైన అంశం, దానిని చెడు దృష్టితో చూడకూడదు అని అందమైన మాటలు చెబుతూ నే దానిని కోట్ల బిజినెస్ కోసం ఎలా మలచుకోవచ్చో చెబుతుంది.

స్త్రీ పురుషుల మధ్యన కేవలం శారీరక సంబంధం మాత్రమే ఉంటుందనుకునేలాగా, “మగవాని దృష్టి ఆడదాని అందం మీదనే ఉంటుందని, దానిని వ్యాపారం చేయవచ్చని” అనుకోవడంలో స్త్రీ జీవితానికి ఇచ్చే విలువేంటో మనం అర్థం చేసుకోవచ్చు. మగవాడి దృష్టిని సాటిస్ఫై చేయడమే ఆడదాని ప్రధాన కర్తవ్యమా?. దీనికన్నా చాగంటి వారి అండర్ వేర్ ఉదాహరణ నయం. ఆడదానికి అన్నింటికంటే ఎక్కువ విలువ ఆమె అందానికీ, ఆమె సెక్స్ అప్పీల్ కీ మాత్రమే ఉందని అంటుందా అమ్మాయి. ఇటువంటి మాటలు చెప్పియ్యడానికి వెనుక ఉన్న భారీ వ్యాపార ధోరణిని మనం అర్థం చేసుకోవాలి. స్త్రీత్వానికి కేవలం ఆమె అందమే ప్రధానం అని జీరో సైజ్ లూ పాండ్స్ పౌడర్ లూ వచ్చినట్టు, సెక్స్ అప్పీల్ మాత్రమే ప్రధానమైన విలువ అని చెప్పి రేపు పోర్న్ సినిమాలూ వస్తాయి. ఇప్పటిదాకా జరిగిన చాలా యుద్ధాలు ఆడదాని అందం కోసం జరిగాయట, బహుశా రామాయణ మహాభారత యుద్ధాలే ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగాయని డైరెక్టరు గారి అవగాహనేమో. ఐతే అది కూడా తప్పు అవగాహనే. ఆడదాని అందం కోసమే యుద్ధం జరిగి ఉంటే సకలాధికారాలుగల రాజులు ఒక స్త్రీ అందం కోసం యుద్ధాలు చేయనవసరం లేదు. స్త్రీని అది కూడా తమ ఇంటి స్త్రీని, ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఎదురొడ్డి పోరాడటం, స్త్రీని స్త్రీగా గుర్తించడం వలన జరుగుతుందే తప్ప, కనులకింపైన అందంగల భోగ వస్తువుగా గుర్తించినందుకు కాదు. పైగా “అందరూ సన్నీలియోన్ లు కాలేరు కానీ ఆ దిశగా ప్రయత్నం చేయడం తప్పసలే కాదు” అని వ్యాపార సూత్రాలు వల్లిస్తుంది ఆ అమ్మాయి. బట్టలిప్పినపుడు చూసేవారికి స్త్రీ అందం మాత్రమే కనిపిస్తుంది తప్ప ఆమె తల్లిదండ్రులెవరు అనే విషయం గుర్తుకు రాదు కాబట్టి, మీరు నిశ్చింతగా ఉండవచ్చు అంటుంది. డబ్బు జీవితాన్ని కుటుంబాన్నీ ఎంత వరకు నాశనం చేయవచ్చో అంతవరకూ నాశనం చేస్తుందనటానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సెక్సువాలిటీని ఒక “ఆస్తి”గా గుర్తించమని మనుషుల జీవితాల్ని, శరీర భాగాలనీ ఆస్తులుగా గుర్తించమంటుంది. “జీవితంలో ఒక చిన్న సత్యముంది: కొంత సంపాదించాలంటే, ఏదో ఒక దాన్ని అమ్మాలి. నేను నా శరీర భాగాల్నీ, అందాన్నీ అమ్ముకుంటాను” అంటుంది. ఈ మాటలన్నీ కేవలం ఒక వర్గం వారి వ్యాపార ధోరణులకు ఊతమివ్వడానికి కాకుండా, నిజంగా స్త్రీల సమస్యలను పరిష్కరించేవిగా ఉన్నాయా..? స్త్రీ అందం ఒక వ్యాపార వస్తువని నమ్మిన సమాజం రేపు ఎంత వయసు పిల్లలను ఈ వ్యాపారంలోకి దింపబోతుంది?. దీనికి అంతటికీ ఈ సినిమా ఇచ్చే పేరు “వుమన్ ఎంపవర్మెంట్”.

ఇంతగా మాట్లాడే ఈ అమ్మాయి, నిజంగా తాను ఎవరితోనైనా శారీరక సంబంధం కలిగే మాట్లాడిందా అనేది అనుమానం. ఇద్దరు మనుషుల మధ్య సంబంధాలు కేవలం శారీరక దగ్గరితనంతో మాత్రమే ఏర్పడతాయనేది ఇటువంటి పోర్న్ వ్యాపార సంస్థల పోకడే తప్ప, వాస్తవానికి స్త్రీ కి అలాకాదు. నిజానికి ఇది స్త్రీ మానసిక ప్రవృత్తికి, హార్మోనల్ డిమాండ్స్ కీ పూర్తిగా వ్యతిరేకమైన అవగాహన. కనీసం “మెన్ ఆర్ ఫ్రం మార్స్, వుమెన్ ఆర్ ఫ్రం వీనస్” వంటి పుస్తకాలు చదివినా ఒక బంధం అంటే స్త్రీకి ఏంటో, అది పురుషుడి అవగాహనకంటే ఎట్లా భిన్నమో అర్థం అయుండేది వర్మ గారికి. ఒక స్త్రీ ఇంకో వ్యక్తితో మానసిక దగ్గరితనాన్ని కోరుకుంటుందే తప్ప కేవలం శారీరక దగ్గరితనం కాదు అనే విషయం, కొంత హ్యూమన్ ఫిజియాలజీ చదివినా అర్థం అయేదేమో. కానీ వర్మ తెలీవైన వాడే. స్త్రీ పురుష సంబంధాలలోని మానసిక దగ్గరితనాలను, అందులోని సంక్షోభాలను, వాటిచుట్టూ అల్లుకున్న మనోవేదనలనూ ఉపరితలం మీదకు రానీకుండా, ఓషో వంటి కల్ట్ గురువులాగా “సెక్స్ ని సెలబ్రేట్ చేసుకోవాలి” అని ఆ అమ్మాయితో అనిపించాడు. ఇది చాలా అందమైన మోసం. తనకు మానసికంగా దగ్గరయిన అబ్బాయి ఈ విధంగానే రోజుకొకరితో తిరుగుతానంటే ఈ అమ్మాయి ఏమని సమాధానమిస్తుందనేది ఆసక్తికరమైన అంశం. వర్మ దానిని సపోర్ట్ చేస్తాడా..? అబ్బాయి అందం చుట్టూ సెక్స్ వ్యాపారం జరగడం లేదు కాబట్టి తను ఎపుడు పెట్టే మూతి విరుపు ఎక్స్ప్రెషనే పెడతాడా.? చూడాలి.

విరించి విరివింటి
4/6//17

-రమణి

(Visited 96 times)

24 Comments

 1. ramani

  స్త్రీ కి భావ స్వేచ్చ కావాలి అంటే అర్థం తండ్రితో “నేను వ్యభిచారం చేసి డబ్బు సంపాదిస్తాను ” అని చెప్పడం కాదనుకుంట. ఈ షార్ట్ ఫిలిం లో స్త్రీ వ్యక్తిత్వాన్ని అవమానించారు. ఈ షార్ట్ ఫిలింకి , చలపతి రావ్ అన్నమాటకి తేడా ఏముంది? ఆతను డైరెక్ట్ గా అన్నాడు , ఇక్కడ నీ స్థానం అదే అని ఒక మహిళ చేత చెప్పించాడు…ఈ సినిమా మగవాళ్ళ ఆలోచనలని వక్రమార్గం పట్టించేదిగా ఉంది మహిళా సంఘాలు ఈ విషయంలో చర్యలు తీసుకుంటే బాగుంటుంది….

  ఈ షార్ట్ ఫిలింని నేను ఖండిస్తున్నాను.

  విరించిగారు మీ విశ్లేషణ చాలా లోతుగా, స్పృష్టంగా ఉంది… చదువుతుంటే ఒక మగవాడి దృష్టిలో ఆడవాళ్ళ స్థానం ఏంటో అర్థం అవుతుంటే బాధగా ఉంది,

  Reply
 2. Ring Master

  ఈ షార్ట్ ఫిలిమ్ నాకు బాగా నచ్చింది. మన తెలుగు చిత్రాలలో బూతు కంటే పోర్న్ ఫిలింమ్స్ లో బూతు ఓ లెక్కలోది కాదు. మడి అందరూ కట్టుకోవాలని లేదు కదా! పోర్న్ ఇండష్ట్రీకి వెళ్లాలన్న ఆ అమ్మాయి ఆలోచన, ఆమె తల్లిదండ్రులకు నచ్చలేదు. చాలా వేదన చెందారు. మీరూ వేదన చెంద వచ్చు. అంతేగానీ ఇంత తీవ్రంగా ‘మిన్ను విరిగి మీద పడ్డట్టు’ ఖండించాలా? ..

  Reply
  1. Ramani Rachapudi

   తను చేయాలనుకున్న ఉద్యోగాన్ని తల్లితండ్రులకి చెప్పడం తప్పు కాదు కాని ఇది వ్యభిచారం మన సంస్కృతికి మన సంప్రదాయాలకి భిన్నమయిన పని, స్మగ్లింగ్ చేస్తాననో, దొంగతనం చేస్తాననో అడిగితె మీరు ఒప్పుకోగలరా? ఒక సున్నితమయిన సృష్టి కార్యాన్ని వ్యాపారం చేసుకుంటాను అని తండ్రితో అనగలగడం స్త్రీ సేవ్చా?ఎక్కడనుండి ఎక్కడికి దిగాజారుతున్నాం మనం? పక్కలోనే పనికోస్తారన్న పెద్దమనిషికి ,పక్క వ్యాపారం చేస్తానని చెప్పించిన ఈ పెద్ద మనిషికి తేడా ఏముంది?

   Reply
 3. Ring Master

  Ramani Rachapudi గారూ! “ఇది వ్యభిచారం మన సంస్కృతికి మన సంప్రదాయాలకి భిన్నమయిన పని, స్మగ్లింగ్ చేస్తాననో, దొంగతనం చేస్తాననో అడిగితె మీరు ఒప్పుకోగలరా?” అన్న మీ అమాయకమైన ప్రశ్నకు, వంద పేజీల సమాధానం చెప్పినా మీరు సంతృప్తి చెందరు. వ్యభిచారం భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. వేశ్యావృత్తి ఇప్పుడు చట్టపరంగా నిషేధంలో ఉండవచ్చు. చాలా మంది తెల్ల చొక్కాలు, ఖండువాలు తొడుక్కున (వైట్ కాలర్) రాజకీయ తార్పుడుగాళ్ల కంటే వేశ్యలు ఉన్నతోన్నతులు. నిజాయితీ పరులు. ఒక్కో సందర్భంలో మనసుపడి/మనసు చంపుకుని శరీరాన్ని మాత్రం అప్పగిస్తారు. వాళ్లకు మల్లె మనసులో మాలిన్యాన్ని నింపుకోరు. వేశ్యల పట్ల మీకున్న దురభిప్రాయాన్ని నేను ఖండించడం లేదుగానీ, కించిత్ చింతిస్తున్నాను..

  Reply
  1. Ramani Rachapudi

   “వ్యభిచారం భారతీయ సంస్కృతిలో అంతర్భాగం.” రాజుల కాలంలో ఒక స్త్రీ స్థానం ఇది. మగవాడి కులాసాలకి బొమ్మ అయి అలుసై అయిన నాటి నృత్యకారిణులు, రాజనర్తకిలు రాజుల చేతిలో కీలుబొమ్మలు , ఒక మగవాడి ఇగో కి అతని ఆనందానికి సమిధలు. అప్పుడు చేసే వ్యభిచారం భారతీయ సంస్కృతీ కాదండి… బలవంతపు సంకెళ్ళు. ఇకపోతే వ్యభిచారం అంటే నాకు దురభిప్రాయం కాదండి జాలి, మీరన్నట్లు కడుపు ఆకలి తట్టుకోలేక ఒకరు, కడుపు నిండి కోరికలను తట్టుకోలేక ఒకరు బలి అవుతారు.నాలుగు గోడల మద్య జరగాల్సిన ఈ అనుబంధపు కార్యక్రమాలు బట్టబయలు చేస్తామంటే ఎవరయినా ఎలా ఒప్పుకుంటారు కుటుంబ బంధాలు మంట కలవవా?

   Reply
   1. Ramani Rachapudi

    యు ట్యూబ్ లో ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఒప్పుకుంటే.. ఇక టి వి యంకర్లని తీసేయడం ఎందుకు వాళ్ళ మాటలని వ్యతిరేకించడం ఎందుకు ఏదయినా వ్యాపారమే కదా అన్ని ఓకే మనకి

    Reply
    1. వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి

     టీవీ యాకర్ల బూతుమాటలకంటే ఈ షర్ట్ ఫిలిమ్ ఏ విధంగానూ బూతు కాదు. ముగ్గురు పాత్రధారులూ అసభ్యతకు తావు లేకుండా చక్కగా నటించారు. ఇక మనం తొడుక్కున్న అద్దాలు అలాంటివైతే ఎవ్వరున్నూ ఏమీ చేయలేరు..

     Reply
   2. వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి

    మిమ్మల్ని రక్షించడానికి ముక్కోటి దేవతలు ఇంకా వారివారి వందిమాగదులు దండిగా ఉన్నారు సోదరీ. రంగు-రుచి-రూపం లేని పరమాత్మను ఒక్కడ్నే నమ్ముకున్న వాడ్ని. నన్నిలా వదిలేయండి..

    Reply
 4. చంద్ర

  అమ్మాయి – అబ్బా అమ్మ, నడుమ ఆడిపోసుకొనేవాళ్ల గోల.

  Reply
 5. వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి

  ప్రార్థన
  *********

  దేవుడా!
  రక్షించు నాదేశాన్ని
  పవిత్రులనుండి పతివ్రతలనుండి
  పెద్దమనుషులనుండి పెద్దపులులనుండి
  నీతుల రెండునాల్కలు సాచి బుసలు కొట్టే
  నిర్హేతుక కృపాసర్పాలనుండి
  లక్షలాది దేవుళ్ళనుండి వారిపూజారులనుండి
  వారి వారి ప్రతినిధులనుండి
  సిద్ధాంత కేసరులనుండి సిద్ధులనుండి
  శ్రీ మన్మద్గురుపరంపరనుండి.

  దేవుడా!
  నలభై కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం వున్న
  మనుష్యులతో నిండిన దేశం నాది (రచనా కాలం: 1963)
  ఆకలీ బాధలూ ఆందోళనలూ సమస్యలూ
  విరివిగా వున్న విచిత్ర సౌధం మాది
  కడుపునిండుగా ఆహారం గుండెనిండుగా ఆశ్లేషం
  బ్రతుకుపొడుగునా స్వతంత్రం
  కొంచెం పుణ్యం కించిత్ పాపం
  కాస్త కన్నీరు మరికాస్త సంతోషపు తేనీరూ
  చాలు మాకు తండ్రీ
  సరదాగా నిజాయితీగా జాలి జాలిగా
  హాయిహాయిగా బ్రతుకుతాం
  మాకు నటనలు వద్దు మాచుట్టూ కటకటాలు వద్దు
  గొప్పలూ గోసాయి చిట్కాలు వద్దు

  దేవుడా!
  కత్తి వాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా
  ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు
  మానవ చరిత్ర పుటలలో నెత్తురొలికి
  మాసిపోయిన అక్షరాల్ని వివరించు
  రహస్యసృష్టి సానువులనుండి జారిపడే
  కాంతి జలపాతాన్ని చూపించు
  మమ్మల్ని కనికరించు
  చావు పుట్టుకలమధ్య సందేహం లాంటి
  జీవితంలో నలువైపులా అంధకారం
  మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం
  మాకున్న ఒకే ఒక అలంకారం
  మజిలీ మజిలీ కి అలిసిపోతున్నాం
  మలుపుమలుపికీ రాలిపోతున్నాం
  ఆశల వెచ్చని పాంపుమీద స్వప్నాల పుష్పాలు జల్లుకొని
  ఆదమరిచి కాసేపు విశ్రమించడాని కనుమతించు తండ్రీ! ?

  -తిలక్ (దేవరకొండ బాలగంగాధర తిలక్)
  రచనా కాలం: 1963

  Reply
 6. వాసంతి విరి తావులు

  బూతుకోణంలో భూతద్దాలు వేసుకుని చూడకపోతే, సబ్జక్ట్ నచ్చినా నచ్చకపోయినా ఈ షార్ట్ ఫిలిమ్ లో మూడు పాత్రల నటన, చిత్రీకరణ అద్భుతంగావుంది.

  Reply
 7. ప్రేమలత

  వివాదాస్పద అంశాలపై చర్చ జరగడం తప్పేమీకాదు. అమ్మాయిలంతా ఆ తీరునే నడుస్తారని అనుకోవడమూ పొరపాటే. జిహ్వకో రుచి బుర్రకో ఆలోచన. అన్నీ అందరికీ నచ్చక పోవచ్చు. జరిగేవి జరుగుతూ ఉంటాయి. షార్ట్ ఫిలిమ్ లో పాత్రల నటన చాలా సహజంగా వుంది. రామ్ గోపాల్ వర్మ మార్క్ కనబడుతోంది.

  Reply
 8. Achalla Srinivasarao

  పైసలుంటే ఏ పైత్యాన్నైనా తెరకెక్కించగల మేధోమూర్ఖత్వం సినీపరిశ్రమ చేసుకున్న ఖర్మ. ..దాని పేరు వర్మ

  Reply
 9. Ring Master

  మన రమణి రాచపూడి గారు మొత్తం మీద ‘మామాట’కు అలాగే రామగోపాల్ వర్మకు Views:57 (ఇప్పటికి) తెచ్చిపెట్టారు. సంతోషం..

  Reply
 10. యజ్ఞపాల్ రాజు ఉపేంద్రం

  మొదటగా…. పైత్యాన్ని తెరకెక్కించగల మేధో మూర్ఖత్వం ఏమో గానీ, అదే పైత్యాన్ని విపరీతంగా జీవితాలలోకి ఎక్కించుకున్న మూర్ఖాతి మూర్ఖత్వం సమాజానిది. తెరమీద కనబడేదానికన్నా ఎన్నో లక్షల రెట్లు అశ్లీలత జనాల మాటల్లో వినవస్తూ, చేతల్లో కనిపిస్తూ ఉంటుంది. బ్లూ ఫిలిమ్స్ అనేవి ఒక యాభై ఏళ్ల క్రితం వచ్చాయే అనుకుందాం, మరి అంతకు ముందు కాలంలో ఇటువంటి భావజాలం లేదా అంటే ఉంది. విపరీతంగా ఉంది. ఏ జాతి చరిత్ర చూసిన ఏమున్నది గర్వ కారణం అనుకోవాల్సి వస్తుంది. ఈ విషయం గురించి మూలాలలోకి వెళితే చాలా దారుణమైన నిజాలు బయటపడతాయి. చాలా సున్నితమైన చర్చ జరగాల్సి ఉంటుంది. ఇక రాం గోపాల్ వర్మ తీసిన షార్ట్ ఫిలిం దగ్గరికి వద్దాం. ఇందులో రెండే విషయాలు ముఖ్యమైనవి గా కనబడుతున్నాయి.

  1.అందులోని అమ్మాయి తను ఏం చేయ్యాలని అనుకుంటూ ఉందో తన తల్లిదండ్రులకు చెప్పడం, మంచైనా, చెడైనా, ఆమె మానసిక పరిపక్వతను తెలియజేస్తుంది. కనీసం ప్రేమించి జీవితాంతం కలిసుంటాము అనుకున్న వారి వివరాలను కూడా తలిదంద్రులదగ్గర దాచిపెట్టే జనాలున్నారు. పోనీ తాము ఏం చదవాలనుకుంటున్నారో కూడా చెప్పలేరు చాలామంది. తనను కన్నవారికి ఏదైనా చెప్పగల ధైర్యం కనబడింది.
  2. ఆ అమ్మాయి సన్నీ లియోన్ అవుతానని చెప్పడం. అందుకుగల కారణాలను వివరించడం. ఇక్కడే అసలు మెలిక. ఒక ఆడదాన్ని వస్తువుకింద జమకట్టి తన శరీరాన్ని, అందాన్ని విపణిలో పెట్టి అమ్మే సంప్రదాయానికి ఎవరు తెరలేపారో ఆలోచించమంటుంది. ఆ ఆలోచన ఆ అమ్మాయికి ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో మనం గమనించాలి. ఒకవైపు స్త్రీత్వాన్ని దైవత్వంగా కొలుస్తూనే ఇంకోవైపు అదే స్త్రీలను పలురకాలుగా తక్కువ చేస్తున్న వ్యవస్థను ప్రశ్నిస్తోంది ఆ అమ్మాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి అటువంటి ఒక పెద్ద నిర్ణయం తీసుకుందో ఒక్కసారి తరచి చూసుకోవాలి. కార్పోరేట్ ఆఫీసుల్లో, సినిమా ఆఫీసుల్లో, ఇంకెక్కడైనా సరే నైపుణ్యన్ని, అందం, శారీరిక సంబంధాలతో కొలవడం ప్రారంభించారో అప్పుడే ఈ ధోరణికి నాంది పడింది.

  అందం, సెక్సువాలిటీ డబ్బు సంపాదనకు మాత్రమే అని ఆ అమ్మాయి చేత అనిపించడం కేవలం చూసేవాళ్ల దృష్టి మరల్చడానికి రాంగోపాల్ వర్మ పన్నిన ఎత్తుగడ మాత్రమే. దీన్ని దాటి మనం ఆలోచించగలమా అన్నది మన ఆలోచనా పరిధిని సూచిస్తుంది.

  ఇప్పుడు మనం రాంగోపాల్ వర్మను అనడంలో పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అతను ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూపించకుండా తెలివిగా తదనంతర పరిణామాలను చూపించాడు. అతను ఇందులో కొత్తగా పుట్టించినది ఏమీ లేదు. అతనొక ఫిలిం మేకర్. పబ్లిసిటీని కోరుకుంటాడు. ఒక వివాదాస్పదమైన విషయాన్ని అత్యంత లాఘువంగా తెరమీదకు ఎక్కించి సొమ్ము చేసుకుంటాడు. అతను చూపించింది ఒక్క జీవితాన్ని, ఒక్క సంఘటనను మాత్రమే. ఒక్క అవకాశం కోసం మొదలుపెట్టి, ఈ లోకం ఇంతే అనుకుని, ఆ కూపంలోనికి జారిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అసలు సమస్యను పక్కనపెట్టి రాంగోపాల్ వర్మ తీసిన ఒక్క షార్ట్ ఫిలిం మీద పడితే మన విశ్లేషణ ఒక దగ్గరే ఆగిపోయినట్టు. ఒక మాట రాంగోపాల్ వర్మను తిట్టడానికి వాడాము అంటే మన దృష్టి సంకుచితం అని మనమే చెప్పుకుంటున్నట్టు. హేతువును వెతకాలి. అది లేకపోతే కేవలం మాటలే మిగులుతాయి.

  గమనిక: నేను రాంగోపాల్ వర్మను సమర్థించడమూ లేదు. ఆ అమ్మాయి నిర్ణయాన్ని ఒప్పుకోనూ లేదు. ఆ షార్ట్ ఫిలిం పరిధిని పెంచి చేసిన విశ్లేషణ మాత్రమే. ఇది చదివి నా వ్యక్తిత్వాన్ని అంచనా వేయొద్దని వినతి.

  Reply
  1. వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి

   యజ్ఞా! నేను రాంగోపాల్ వర్మను సమర్ధిస్తున్నాను, ఆ అమ్మాయి నిజాయితీని ఒప్పుకుంటున్నాను, అలాగే ఆమె తల్లిదండ్రుల ఆవేదనను అర్ధం చేసుకుంటున్నాను. మనం సంకుచిత కోణంలోనే ఆ ఫిల్మ్ ను చూస్తున్నామన్న విషయాన్ని నువ్వు అద్భుతంగా విశ్లేషించావు. కానీ, గమనిక అంటూ బిత్తరిచూపులు ఎవరికోసం?..

   Reply
 11. వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి

  యజ్ఞపాల్ రాజు అన్నట్టు మన మూలాల్లోకి వెళితే ఆ కంపు అంతా ఇంతా కాదు. బహిరంగ భగ పూజలు, లింగారాధనలు (ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో కొనసాగుతున్నాయి) మన సాంస్కృతిక వైభవంలో పెద్దపీటే వేసుకున్నాయి. దేవాలయాల మీద కామకేళీ శిల్పాలు చెక్కి బహిరంగ కామకేళిని ప్రోత్సహించిన సంస్కృతీ మనదే. రవికల పండగ పేరుతో విచ్చలవిడి శృంగారానికి వాకిళ్లు తెరిచిందీ మనమే.

  ఇకపురాణాలలోకి వెడితే-

  గురుపత్నికి కాపలాగా ఉండమని శిష్యుడిని పురమాయించి వెడితే, ఆ శిష్యుడు గురుపత్నితో బహిరంగ కామకేళికి పూనుకుని గురువుకు దొరికి పోతాడు -అదే తారాశశాంకం.

  మేనకా, విశ్వామిత్రుల విచ్చలవిడి కామకృత్యాలకు ప్రతీకగా ఒక ఆడబిడ్డ జన్మిస్తే, వారిరివుడు ఎవరికివారు చీర-పంచె దులుపుకుని కన్నబిడ్డను గాలికొదలి వెళ్లిపోతారు.

  ఇలా మన బాండాగారం నిండా వేలకువేల బూతుగాధలే. “కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది” అన్న నానుడి ఇలాంటి వాటినుండే పుట్టింది.

  -ఇప్పడీ పోర్న్ కల్చర్ (బహిరంగ కామకేళి) పై రాంగోపాల్ వర్మ స్పృశించింది చాలా స్వల్పమైన అంశం మాత్రమే. ఇంకా లేవనెత్తాల్సినవి. గడ్డి పెట్టాల్సినవి చాలానే ఉన్నాయి.

  ఉలికి పాట్లు కాదు అవసరం. వాస్తవాల గ్రహింపు కావాలి..

  Reply
 12. ప్రేమలత

  మనం ప్రతి విషయానికి మగాళ్ల మీద పడి ఏడ్చినంతకాలం వాళ్ల తీరు మారదు. కూసే ప్రతి గాడిదను హైలైట్ చేసి, ఆ వదరుబోతువెధవల జపంచేయడంకంటే, చత్తకుప్పను చెత్తకుప్పలోనేవుంచి మన చేవ ఏమిటో కార్యరూపంలో చూపడం మంచిది. ఏడ్చేవాళ్లును ఏడిపించడం మనిషి దుష్టనైజాల్లో ఓకటి. అయినా పూర్తిగా మగజాతి అంతటిమీదా విరుచుకపడీ ఫలితంవుండదు. మనం మగవాళ్లతో సంబంధంలేని వాళ్లంకాదు. పురుషాహంకార ధోరణిని తప్పుపట్టే క్రమంలో మనం తప్పటడుగులు వేయకూడదు. ఆడిపోసుకోవడం తప్ప ఏమీ చేతకాదన్న అపవాదును మూటకట్టుకొని సాధించేదేమీవుండదు. వాడెవడో కత్తిలా వుందనగానే నాలుకమీద కత్తై గుచ్చుకోవాలి, అంతేగానీ మెటికలు విరిచి తిట్టినంత మాత్రాన వాడికేమీ నొప్పుండదు. కొంచం ఈ చట్రంలోంచి బయటపడి చైతన్యవంతంగా, హుందాగా ఆలోచించమని మహిళలకు నా మనవి.

  Reply
  1. SANTOSH B.R. Dr,

   ……………………….చాలా విశ్లేషణాత్మకంగా చేప్పేరు……….

   Reply
 13. వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి

  మొత్తం మీద మా సోదరి శ్రీమతి రాచపూడి రమణి ఆర్టికల్ కు, మా ‘మామాట’ అంతర్జాల వార్తా సమాహారంలో ఇప్పటికి మా అందరికంటే మిన్నగా వీక్షణలు: 154 (Views:154) రావడాన్ని మనసారా స్వాగతిస్తున్నాను. సోదరీ మీకు నా అభినందనలు..

  Reply
 14. Sridhar Gupta

  అమ్మాయి విచ్చలవిడిగా వుంటానండి. తల్లి తండ్రి అది తప్పని నెత్తీనోరు బాదుకున్నరు. అందుకు వర్మనెదుకు తల్లులూ తిట్టడం. షార్ట్ ఫిలిమే కాదా మీరూ పోటీగా ఒకటి తిసెయ్యండి. ఎవ్వరూ చూడరనే కదా మీ బాధ. కళ్లు కాళీగా వున్నప్పుడు మేం చూస్తం లేండి.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: